
అమరావతి, 5 నవంబర్ (హి.స.)రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం ఏఐ పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. దేశంలోనే తొలి ఏఐ టెక్నాలజీ ఆధారిత పోర్టల్ గా ఇది నిలవనుంది. ‘నైపుణ్యం’(Naipunyam) పేరిట అందుబాటులోకి రానున్న ఈ పోర్టల్ రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించేందుకు వేదిక కానుంది. అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కృత్రిమ మేధ (AI)తో ఇంటర్వ్యూను ప్రవేశ పెడుతోంది. ప్లంబర్ నుంచి బీటెక్ టెక్నాలజీ విద్య వరకు ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని పోర్టల్ లోని ఏఐ అంచనా వేస్తుంది. నిరుద్యోగులు తమ అర్హతలతో ఏఐని వినియోగించి రెజ్యుమెను సైతం ఇందులో తయారు చేసుకోవచ్చు.
నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో ఈ పోర్టల్ ను ఆవిష్కరించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దనున్న అన్ని రకాల డేటాను ఈ పోర్టల్‌తో అనుసంధానం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్, ఆధార్, డిజి లాకర్, ఈపీఎఫ్, ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను పోర్టల్ కు అనుసంధించనున్నారు. అంటే వీటి ద్వారా ఎవరైనా ఇప్పటికే ఉద్యోగంలో ఉంటే ఆ వివరాలు కూడా తెలుస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం వద్దనున్న పాఠశాల స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు ఉన్న వివిధ విభాగాల డేటాను అనుసంధానిస్తారు. ఆర్థికశాఖ వద్దనున్న ఉద్యోగుల డేటాను (Data) కూడా దీనికి లింక్ చేస్తారు. ఉద్యోగాల కల్పన సంస్థలు నౌకరీ, విజన్ ఇండియా వంటి సంస్థలు, ఇన్ఫోసిస్, యునిసెఫ్ వంటి అభ్యసన ప్లాట్‌ఫాంలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. వాటి వద్ద ఉండే జాబ్ ఖాళీల వివరాలు ఈ పోర్టల్‌లో కనిపిస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV