
అమరావతి, 4 నవంబర్ (హి.స.)పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల తరువాత ఎక్కువ సమయం గడిపేది స్కూల్ టీచర్లతోనే. వారి సంరక్షణలోనే పాఠాలను నేర్చుకుంటారు. కొందరు ఉపాధ్యాయులు (Teachers Pride) మరో ముందడుగు వేసి నైతిక విలువలను కూడా నేర్పిస్తారు. అంతేకాకుండా పాఠశాలను చక్కగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నం కారణంగా ఇటు విద్యార్థులు, అటు పాఠశాల పరిసరాలు గొప్పగా తయారవుతాయి. అలాంటి టీచర్లలో ఒకరు మనోజ నంబూరి. విజయవాడ (Vijayawada) రూరల్ లోని వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వారు విధులను నిర్వహిస్తున్నారు.
టీచర్ మనోజ నంబూరి గురించి స్వయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆమె చేస్తున్న కృషికి జేజేలు పలికారు. ఆయన పంచుకున్న వివరాల ప్రకారం మనోజ నంబూరి ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడ తోటను పెంచుతూ వస్తున్నారు. అందులో విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేస్తున్నారు. తద్వారా బడి తోటలో కూరగాయలు, పండ్ల చెట్లను పెంచుతున్నారు. పండ్లను విద్యార్థులతో పంచుకుంటున్నారు. కూరగాయలను మధ్యాహ్నం భోజనంలో వినియోగిస్తున్నారు. ఇటువంటి స్ఫూర్తిదాయకమైన పని చేస్తున్న టీచర్ మనోజ నంబూరిని (Manoja Namburi) మంత్రి లోకేష్ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV