
అమరావతి, 5 నవంబర్ (హి.స.)వానలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.తర తమిళనాడు తీరం, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో నేటి వాతావరణం ఇలా..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు (నవంబర్ 5) కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక గురువారం నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంబాల వద్ద నిల్చోవద్దని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV