
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.):దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజపేయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట లో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.సాయిరామ్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహాన్ని తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ వాజపేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ దేశాభివృద్ధికి పరితపించిన వాజపేయి నేటి తరాలకు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు ఏపీఐడీసీ రాష్ట్ర చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, బీజేపీ జాతీయ కౌన్సిల్‌సభ్యులు వేటుకూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ