
హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్ ఇకపై కేవలం టెక్నాలజీ హబ్ గా మాత్రమే కాకుండా భద్రమైన, బాధ్యతాయుతమైన ఏఐ భవిష్యత్తును నిర్మించే కేంద్రంగా మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఏఐ కమాండ్ సెంటర్ గా, ప్రపంచ ఉత్పత్తులు రూపొందే స్థలంగా మారబోతోందన్నారు. ఇవాళ హైదరాబాద్లో కోవాసెంట్ కొత్త ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను (Kovacent Al Center) మంత్రి ప్రారంభించారు. 500 మంది ఏఐ ఇంజనీర్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ సెంటర్.. 2028 నాటికి 3000 మంది ఏఐ ఇంజనీర్లకు వేగంగా విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు కృత్రిమ మేథస్సు యుగాన్ని నడిపేందుకు పోటీ పడుతున్నాయని చెప్పారు. అయితే హైదరాబాద్ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుందని ఇక్కడ మేము లోతైన సామర్థ్యం, దీర్ఘకాల దృష్టిపై ఆధారపడి నాయకత్వాన్ని నిర్మిస్తున్నామన్నారు. రాబోయే సంవత్సరంలో అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ సెంటర్ల పెరుగుదలతో పాటు ఏఐ మరియు సైబర్ సెక్యూరిటీలో ప్రత్యేక పాత్రలు విస్తరిస్తాయని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..