
అమరావతి, 1 డిసెంబర్ (హి.స.)
నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ యువతకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని సహచర టీడీపీ ఎంపీలతో కలిసి పార్లమెంటులో ప్రస్తావిస్తానని తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధితో పాటు యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను తెలియజేయాలని కోరారు. టీడీపీ నాయకులుగా.. తాము భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత దానిలో భాగం కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. జాతీయ వేదిక అయిన పార్లమెంటు ద్వారా రాష్ట్ర యువతకు సంబంధించి ముఖ్యమైన సమస్యలపై దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. సమస్యలను తనకు కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ