
తిరుమల, 1 డిసెంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. ప్రస్తుతం తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎడతెరపి లేని వర్షం కురుస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఆదివారం రోజున కురిసిన భారీ వర్షం నేపథ్యంలో, తిరుమల శ్రీవారి సన్నిధిలోని దర్శనీయ ప్రదేశాలు పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను మూసివేసింది టిటిడి పాలకమండలి.
ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాలను అలిపిరి వద్ద అలర్ట్ చేసింది టీటీడీ. అంతేకాదు భారీ వర్షాలు నేపథ్యంలో అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది ఇలా ఉండగా భారీ వర్షాలు నేపథ్యంలో తిరుమలలోని ఐదు డ్యాములు పూర్తిగా నిండినట్లు చెబుతున్నారు అధికారులు. ఆ డ్యాములు నిండిపోయి వరద పొంగిపొర్లుతోందని స్పష్టం చేస్తున్నారు. పాప వినాశనం, గోగర్భం డ్యాములలో ఒక గేటు తెరచి, నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
ఆకాశగంగా, పసుపు ధార, కుమార్ ధార డ్యాములు కూడా పూర్తిగా నిండిపోయాయి. కాగా ఈ దిత్వా తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఏపీ హోం శాఖ మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. దిత్వా తుఫాన్ ప్రభావం ఉన్న నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దిత్వా తుఫాన్ వల్ల విద్యుత్ కు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు మంత్రి అనిత.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV