
నెల్లూరు, 10 డిసెంబర్ (హి.స.)
కామ్రేడ్ పెంచలయ్య (Comrade Penchalaiah) పెద్దకర్మ సందర్భంగా సీపీఎం (CPM) ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. నెల్లూరు ఆర్టీసీ కాలనీలో ఏర్పాటు చేసిన సభకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy), సీపీఎం నాయకులు మాజీ డిప్యూటీ మాదాల వెంకటేశ్వర్లు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, బిజెపి నాయకుడు ఎర్రబోలు రాజేశ్, ఇతర కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గంజాయి మహామ్మారిని నిర్మూలించాలని పెంచలయ్య ఎంతో పోరాడారన్నారు. రౌడీయిజానికి కూడా వెరవకుండా తన పోరాటం కొనసాగించారన్నారు. అసాంఘీక కార్యక్రమాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు పెంచలయ్య అని కొనియాడారు. గంజాయి మహామ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటం అసువులు బాసిన అమరవీరుడు కామ్రేడ్ పెంచలయ్య అని వక్తలు అన్నారు. పెంచలయ్య మరణం సమాజానికి తీరని లోటుగా అభివర్ణించారు. ఆయన మరణానికి కారణమైన గంజాయి ముఠాను సమాజం ఎన్నటికీ క్షమించదన్నారు. తగిన గుణపాఠం తప్పకుండా చెబుతుందన్నారు. జోహార్ కామ్రేడ్ పెంచలయ్య.. సాధిద్దాం సాధిద్దాం పెంచలయ్య ఆశయాలను సాధిద్ధాం అంటూ బేషజాలు మరచి ముక్తకంఠంతో నినదించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV