
నల్గొండ, 11 డిసెంబర్ (హి.స.)
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంచాయతీ
ఎన్నికలు నివురుగప్పిన నిప్పులా మారాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎక్కడో ఒకచోట కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయులు పరస్పర దాడులకు దిగుతున్నారు. తాజాగా, పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇవాళ ఉదయం చిట్యాల మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి కాంగ్రెస్ నేత, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కూడా తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల శ్రేణుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఓ దశలో అమిత్ రెడ్డి, భూపాల్ రెడ్డి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని గొడవలు వద్దని వారించడంతో పరిస్థితిని సద్దుమణిగింది.కాగా, ఇవాళ తెల్లవారుజామున కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు