
అమరావతి, 11 డిసెంబర్ (హి.స.)
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 44 అజెండాలపై మంత్రి వర్గం చర్చించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. రూ.9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలనపరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ సమావేశానికి పలువురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఎలా? అంటూ ఆగ్రహాన్ని వెల్లిబుచ్చారు. అనంతరం మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో మరింత వేగం పెంచాలని సూచించారు. గోదావరి పుష్కారాల నేపథ్యంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఆలయాల దగ్గర రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
విశాఖపట్నంలో రుషికొండలో నిర్మించిన ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావడంపై కూడా సీఎం చర్చించారని సమాచారం. అందుకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని.. దాని నివేదికపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పర్యాటక రంగ అభివృద్ధి కోసం పర్యాటక శాఖ, దేవాదాయ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV