
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)
ఉప్పల్ స్టేడియంలో జరగనున్న కార్యక్రమాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. స్టేడియానికి చేరుకున్న డీజీపీ, అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి కీలక సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కోల్‌కతాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను స్క్రీనింగ్ చేసి సిబ్బందికి చూపించారు. ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని, జనసమూహ నియంత్రణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా స్టేడియం పరిసరాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సుమారు 3 వేల మంది పోలీసులు మోహరించినట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు వంటి చర్యలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రేక్షకుల భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..