
తెలంగాణ, 13 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య (55) అనే వ్యక్తిని ఈనెల 10న రాత్రి అదే గ్రామానికి చెందిన మూతి నరేశ్ (21), అతని అన్న మల్లేశ్ (23) కలిసి హత్య చేశారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అతడి మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు. భీమయ్య కుటుంబ సభ్యుల కంప్లైంట్తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భీమయ్య మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో హత్య చేసినట్లు విచారణలో నిందితులు తెలిపారని పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు