
సూర్యాపేట, 13 డిసెంబర్ (హి.స.)
గ్రామపంచాయతీ ఎన్నికలను
పూర్తిస్థాయి ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జరగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను శనివారం కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి స్కూల్స్ లో పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో రెండో విడతగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 8 మండలాల్లో మొత్తం 181 గ్రామపంచాయతీలకు ఎన్నికలు షెడ్యూల్ కాగా, ఏకగ్రీవం కాని గ్రామపంచాయతీల పరిధిలో 158, గ్రామపంచాయతీలకు, 1460 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణకు 1462 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, అవసరమైన పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది అందరూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని చెప్పారు. శనివారం నిర్వహించిన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ద్వారా పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందజేసి, వారు తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు