
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)
తెలుగు సినీ సంగీతానికి చిరస్థాయిగా నిలిచిన గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతికి నివాళిగా ఈ నెల 15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులు పాల్గొని బాలు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
అదే రోజున సాయంత్రం 4 గంటల నుంచి సినీ సంగీత స్వరనీరాజనం కార్యక్రమం జరగనుందని సంస్థ అధ్యక్షుడు అచ్యుత రామరాజు వెల్లడించారు. బాలు పాడిన అమరగీతాలను ప్రముఖ గాయకులు, కళాకారులు ఆలపించనుండగా… సంగీతాభిమానులకు ఇది ఓ మరపురాని అనుభూతిగా నిలవనుంది.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం ఎంట్రీ పాసులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాసుల పంపిణీ కోసం 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రవీంద్రభారతిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల బాలు విగ్రహం ఏర్పాటు అంశంపై కొంత వివాదం నెలకొన్నప్పటికీ, అన్ని అడ్డంకులను అధిగమించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు