
విజయవాడ, 13 డిసెంబర్ (హి.స.)ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సందర్శకులపై నియంత్రణ విధించాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని చెవిరెడ్డి తరఫు న్యాయవాదులను న్యాయస్థానం ఆదేశించింది.
ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న చెవిరెడ్డిని విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన హంగామా చేస్తున్నారని సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు తప్ప ఇతరులెవరూ ఆయన్ను కలవకుండా ఆదేశాలు జారీ చేయాలని తమ పిటిషన్‌లో కోరారు. గతంలో ఇలాంటి ప్రవర్తనపై కోర్టుకు ఫిర్యాదు చేయగా, ఇకపై ఎలాంటి హడావుడి చేయనని చెవిరెడ్డి లిఖితపూర్వకంగా అఫిడవిట్ సమర్పించారు.
అయినప్పటికీ, ఆయన తన వైఖరి మార్చుకోలేదని, కోర్టుకు వచ్చిన ప్రతిసారీ మీడియా కనిపించగానే మాట్లాడుతున్నారని సిట్ అధికారులు ఆరోపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, చెవిరెడ్డి తరఫు న్యాయవాదుల వివరణ కోరుతూ విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తుది నిర్ణయం వెలువరించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV