
అద్దంకి, 14 డిసెంబర్ (హి.స.)
వైయస్ జగన్ (YS Jagan) నాయకత్వంలోని వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు. ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజలపై భారాన్ని మోపారు. ట్రూ అప్ ఛార్జీలతో ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారు. తాము ఆ ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ ఛార్జీల దిశగా తీసుకెళ్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) అన్నారు. అందుకు అనుగుణమైన కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఏపీ సూర్యఘర్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులపై ధరల భారం తగ్గుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏపీ సూర్యఘర్ పథకం కింద 10 వేల కనెక్షన్లను ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ ధరల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV