అంధుల టీ 20 ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ
పుట్టపర్తి/పాడేరు 14 డిసెంబర్ (హిం.స) , అంధుల టీ-20 ప్రపంచ కప్‌ సాధించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ దీపిక, క్రికెటర్‌ పాంగి కరుణకుమారిలకు డిప్యూటీ సీఏం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అండగా నిలిచారు. ఆ జట్టు సభ్యులు శుక్రవారం పవన్‌కల్యాణ్‌
అంధుల టీ 20 ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ


పుట్టపర్తి/పాడేరు 14 డిసెంబర్ (హిం.స)

, అంధుల టీ-20 ప్రపంచ కప్‌ సాధించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ దీపిక, క్రికెటర్‌ పాంగి కరుణకుమారిలకు డిప్యూటీ సీఏం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అండగా నిలిచారు. ఆ జట్టు సభ్యులు శుక్రవారం పవన్‌కల్యాణ్‌ను కలవగా ఒక్కొక్క క్రికెటర్‌కు రూ.5 లక్షలు అందించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఫీజుతో తమ కుటుంబ సభ్యుల ఆకలి తీర్చానని ఆ సందర్భంగా దీపిక చెప్పిన మాటలకు పవన్‌కల్యాణ్‌ ఆవేదన చెందారు. 24 గంటల్లోనే ఆమె కుటుంబానికి అవసరమైన వస్తువులు, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలను ఆమె ఇంటికి పంపించారు. జనసేన ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, ఆహుడా చైర్మన్‌ టీసీ వరుణ్‌, ఇతర నాయకులు శనివారం శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టిలోని దీపిక ఇంటికి ఆ సరుకులను చేర్చారు.

అలాగే, ‘మా ఊరికి రోడ్డు కావాలి సర్‌..’ అని దీపిక అడిగిన వెంటనే డిప్యూటీ సీఎం స్పందించి నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీపిక కుటుంబానికి ఇంటిని నిర్మించి ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారని జనసేన నాయకులు తెలిపారు. గృహనిర్మాణం పూర్తి అయిన వెంటనే అవసరమైన వస్తువులను సమకూరుస్తామని చెప్పారు. దీపిక తల్లిదండ్రులు చిక్క తిమ్మప్ప, చిత్తమ్మ డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, జట్టు సభ్యురాలైన కరుణకుమారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ తగిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు 24 గంటలు గడవక ముందే ఎల్‌ఈడీ టీవీ, గ్రైండర్‌, ఐరన్‌ బాక్స్‌, టేబుల్‌ ఫ్యాన్‌, కుర్చీలు, కుక్కర్లు, ఇతర వంట సామగ్రి, దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర సరుకులను శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలోని కరుణకుమారి ఇంటికి పంపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande