
నిజామాబాద్, 14 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న ఓ అభ్యర్థి వర్గం మరొకరిపై పోలింగ్ బూత్ లోపల రిగ్గింగ్ చేస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తూ అక్రమంగా ప్రచారం నిర్వహిస్తున్నారని పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి మద్దతుదారులు పోలింగ్ కేంద్రం వైపు దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు పోలింగ్ బూత్ లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో పోలీసులతో తోపులాట జరిగింది. దీంతో వారు లాఠీలు ఝుళిపించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
మనోహర బాద్ మండలం కోనాయపల్లి గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మధ్య వాగ్వాదం రాగా ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. లింగారెడ్డిపేట, కల్లకల్లో కూడా గ్రామస్థులు ఘర్షణకు దిగుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు