
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.)
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలు ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరారు. శివసత్తులు శివాలెత్తగా, పోతురాజుల విన్యాసాలు, డమరుగా నాదాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కళ్యాణం జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న మనువాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మల్లన్న కల్యాణోత్సవానికి హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు వెండి పళ్లెంలో నెత్తిన పెట్టుకుని సాంప్రదాయ బద్దంగా మేళ, తాళాలతో వచ్చి సమర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..