
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలోని గ్రామాలకు ఈనెల 20 నుంచి కొత్త సర్పంచ్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గాల బాధ్యతలు చేపట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన అపాయింటెడ్ డేను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. మూడు విడతల్లో ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గాలన్నీ 20వ తేదీన ఒకేసారి ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఆ రోజు నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరి, ఐదు సంవత్సరాల కాలపరిమితి పాటు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, వివిధ కారణాలతో 21 గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మరికొన్నింటిపై కోర్టు స్టే ఉండగా, మిగిలిన దాదాపు 12,700 గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడనున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు