
సూర్యాపేట, 14 డిసెంబర్ (హి.స.)
స్థానిక ఎన్నికల వేళ కోదాడ
మండలంలోని తొగర్రాయి గ్రామంలో ఓ అభ్యర్థికి సంబంధించిన డబ్బుల పంపిణీ ఘటన కలకలం రేపింది. ఆదివారం గ్రామంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న నమ్మకమైన సమాచారంతో పోలీసులు, ఎన్నికల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు ఓ అభ్యర్థి తరఫున పంపిణీ కోసం తీసుకువెళ్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు