
అనకాపల్లి, 14 డిసెంబర్ (హి.స.)
అనకాపల్లి జిల్లాలో (Anakapalli District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం చెర్లోపాలెం, గణపర్తికి చెందిన దుర్గ, ధనుష్ లు బైకుపై ప్రయాణిస్తున్నారు. అనకాపల్లి అచ్చుతాపురం మండలం ఉప్పవరం మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జగన్నాథపురం వద్దకు చేరుకోగానే బైకు అదుపు తప్పింది. ధనుష్ బైకును అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వేగం మీదున్న బైకు నేరుగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. బైకు బలంగా స్తంభాన్ని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో దుర్గ, ధనుష్ లు తీవ్రంగా గాయపడ్డారు. వారి శరీరానికి బలమైన గాయాలు అయ్యాయి. గాయాల కారణంగా రక్తస్రావం జరిగింది. ఈ ఘోరమైన ప్రమాదంలో వారిద్దరూ ప్రాణాలను కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలంతో పాటు పరిసరాలను గమనించారు. అక్కడి నుంచి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV