
కడప, 14 డిసెంబర్ (హి.స.)కడప జిల్లాలో (YSR Kadapa District) అనుకోని ఓ రోడ్డు ప్రమాదం ఈ రోజు జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం శ్రావణ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు కర్నూలులోని నిర్మలనగర్ లో నివాసం ఉంటున్నారు.
వారాంతం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి శనివారం వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం తెల్లవారుజామున కర్నూలుకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వారి కారు ప్రమాదానికి గురైంది. ఒంటిమిట్ట సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట చెరువు కట్టపైకి కారు చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డుపై నుంచి నేరుగా ఒంటిమిట్ట చెరువులోకి (Ontimitta Cheruvu) కారు దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా కారులో ఉన్న శ్రావణ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV