
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)
ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బిల్డింగ్ డివిజన్ డీఈఈ శ్రీనివాస్ రూ.6000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ భవనం మరమ్మత్తు పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ కు రూ.14 లక్షలు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో తనకు రూ,11000 లంచం ఇవ్వాలని, ఇస్తేనే ఆ బిల్లులను క్లియర్ చేస్తానని డీఈఈ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. ఆ కాంట్రాక్టర్ రూ.5000 రూపాయలు ఫోన్ పే చేశాడు. అయినప్పటికీ మిగతా రూ. 6,000 రూపాయలు కూడా ఇస్తేనే బిల్లు క్లియర్ చేస్తానని బెదిరించడంతో పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రూ.6000 లంచం తీసుకుంటుండగా డీఈఈ శ్రీనివాస్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..