
పట్నా,/ఢిల్లీ 16,డిసెంబర్ (హి.స.) దిల్లీ: క్షేత్రస్థాయి కార్యకర్తలను ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చే ఏకైక రాజకీయ పక్షం భాజపాయేనని ఆ పార్టీ నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా పేర్కొన్నారు. తనకు లభించిన తాజా పదోన్నతిని పార్టీ ఆశీర్వాదంగా అభివర్ణించారు. భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆదివారం నియమితులైన ఆయన.. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు- పట్నాలోని తన నివాసంలో నితిన్ నబీన్ విలేకర్లతో మాట్లాడారు. తనను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినందుకు భాజపా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భాజపా యువకులను ప్రోత్సహించే పార్టీ మాత్రమే కాదు. పెద్ద లక్ష్యాలను సాధించే దిశగా వారికి మార్గనిర్దేశం కూడా చేస్తుంది. క్షేత్రస్థాయి కార్యకర్తలను ఎదగనిచ్చే ఏకైక పార్టీ ఇదే’’ అని వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతానికి ఓపికగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ