
మంగళగిరి, 17 డిసెంబర్ (హి.స.)
గ్రామ రెవెన్యూ సహాయకుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వీఆర్‌ఏ సంఘాల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.బాలకాశీ డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద మంగళవారం మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వీఆర్‌ఏలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీసీఎల్‌ఏ అధికారులకు వినతిపత్రం అందజేశారు. నేతలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 20 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు పనిచేస్తున్నారని,
వీరికి 2018లో వేతనం రూ.10,500లకు పెరిగిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పెంచలేదని చెప్పారు. గత ప్రభుత్వంలో వీఆర్‌ఏలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని, చాలీచాలని వేతనంతో నేడు కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలకు తెలంగాణ ప్రభుత్వం తరహాలో పేస్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్‌ఏలుగా నియమించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ