
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయడానికి ఈనెల 20వ తేదీని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పుడు మళ్లీ నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా వేశారు. తాజా నిర్ణయం ప్రకారం.. ఈ గడువును డిసెంబర్ 22వ తేదీకి మార్చారు. డిసెంబర్ 20న పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. సరైన ముహూర్తాలు లేవని, బాధ్యతలు స్వీకరించడం మంచిది కాదని భావించిన పలువురు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో నూతన సర్పంచుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీ రాజ్ శాఖ, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రెండు రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నూతన పాలకవర్గాలతో ప్రమాణస్వీకారం చేయించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు