
ఢిల్లీ 18డిసెంబర్ (హి.స. )
ఛత్తీస్‌గఢ్‌లో నేడు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతం పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. అయితే, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది (Sukma Maoist encounter).
నేడు ఉదయం నుంచే ఆ ప్రాంతంలో అప్పుడప్పుడూ కాల్పులు శబ్దాలు వినిపించాయి. దీంతో, అధికారులు హైఅలర్ట్‌లో ఉన్నారు. ఇక తాజా ఎన్‌కౌంటర్ తరువాత పోలీసులు ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ నక్సల్స్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో తొలుత భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇంతలో నక్సలైట్స్ కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో కొందరు మావోయిస్టులు మరణించినా గాయపడ్డ వారు అడవిలోకి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, అదనపు భద్రతా దళాలు కూడా రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి ప్రకటన ఇంకా చేయాల్సి ఉంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ