
అమరావతి, 2 డిసెంబర్ (హి.స.):సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్ బహిరంగ సభలో కులాల ప్రస్తావన తీసుకొచ్చారు.
కాపులు, దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందంటూ అనకాపల్లి జిల్లాలోని ఓ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. కాపు సీఎం, దళిత డిప్యూటీ సీఎం కొనసాగవచ్చంటూ సునీల్ బహిరంగంగా చేసిన సూచన రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. సునీల్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆలిండియా సర్వీస్ నిబంధనలు అతిక్రమించిన సునీల్ కుమార్‌పై చర్య తీసుకోవాలని డీవోపీటీకి లేఖ రాశారు. అగ్నిమాపక శాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు.. అగ్రిగోల్డ్ లబ్ధిదారుల పేరుతో నిధులు పక్కదారి మళ్లించారన్న ఫిర్యాదు.. ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లడంతో ఆయన సస్పెండ్ అయిన విషయాలను లేఖలో పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ