
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 15న ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో షోరూంను కూడా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో భారత విపణిలోకి అడుగుపెట్టిన టెస్లాకు నిరాశ తప్పలేదు. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని తెలిసింది.
సెప్టెంబర్లో డెలివరీలు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 157 కార్లను మాత్రమే టెస్లా విక్రయించినట్లు ప్రభుత్వ వాహన్ పోర్టల్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక నవంబర్ నెలలో టెస్లా కేవలం 48 కార్లను మాత్రమే డెలివరీ చేసింది. ఈవీ అమ్మకాల్లో బీఎమ్ డబ్ల్యూ, మెర్సిడెస్ - బెంజ్ వంటి లగ్జరీ సంస్థల కంటే టెస్లా వెనుకబడింది. బీఎమ్ డబ్ల్యూ ఇండియా నవంబర్లో ఏకంగా 267 ఈవీ కార్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు