
కడప, 2 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో అనేక ప్రమాదాలు జరగటంతో పాటు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో బస్సు ప్రమాదం జరిగింది. కడపకు చెందిన హరిత ట్రావెల్స్ బస్సు బెంగుళూరు వెళుతుండగా ఆంధ్ర కర్ణాటక బార్డర్ లోని మంచినీళ్ల కోట వద్ద డివైడర్‌ను ఢీకొట్టి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, 10 మందికి గాయాలయ్యాయి. మృతిచెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58)గా గుర్తించారు.
పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. గాయపడినవారు కడప, రాయచోటి, బెంగుళూరు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు నలుగురిని మదనపల్లెలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇక రాష్ట్రంలో గత నెలలో జరిగిన నెల్లూరు బస్సు ప్రమాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా ఆ తరవాత వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ట్రావెల్ బస్సులు మరోవైపు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV