
ఖమ్మం, 20 డిసెంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా రవాణాశాఖ (RTA)
కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక ఉద్యోగిని అరెస్టు చేసిన ఏసీబీ సిబ్బంది, పలు కీలక దస్తావేజులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (RC)లు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్లో రవాణాశాఖలో జరుగుతున్న అక్రమ వసూళ్లు, దళారుల ద్వారా లంచాలు తీసుకోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. కార్యాలయంలో అనధికారిక వ్యక్తులు పనిచేస్తూ, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ జారీ వంటి పనులకు మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు