బ్యాంకుల సహకారం ఉంటేనే నేరాలకు కళ్లెం!!
ఆర్బీఐ గవర్నర్‌తో హైదరాబాద్ సీపీ సజ్జనర్ భేటి*
బ్యాంకుల సహకారం ఉంటేనే నేరాలకు కళ్లెం!!*


హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)

దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల కష్టార్జితానికి పెను సవాలుగా మారిన సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు చెక్ పెట్టాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అనివార్యమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. సైబర్ నేరగాళ్లకు ఆక్సిజన్‌లా మారిన ‘మ్యూల్ ఖాతాల’ నియంత్రణలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన చె ప్పారు.

హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయంలో శుక్రవారం గవర్నర్ శ్రీ సంజయ్ మల్హోత్రాతో న‌గ‌ర సీపీ శ్రీ వీసీ సజ్జనర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాల‌ను ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లింది.

సైబర్ నేరగాళ్లు అమాయక విద్యార్థులు, కూలీలకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు కమీషన్ ఆశచూపి, వారి పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నారని సీపీ సజ్జనర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును క్షణాల్లో ఈ ఖాతాల ద్వారానే మళ్లిస్తున్నారని వివరించారు. వీటిని అరికట్టడానికి మ్యూల్ ఖాతాల గుర్తింపునకు ప్రత్యేకంగా ‘సెంట్రలైజ్డ్ డేటాబేస్’ ఏర్పాటు చేయాలన్నారు.

ఖాతాలు తెరిచే సమయంలో బ్యాంకు సిబ్బంది పాటించాల్సిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కోరారు. ముఖ్యంగా ఖాతాదారుడు భౌతికంగా ఉన్నాడా లేదా అని నిర్ధారించుకునేందుకు ‘జియో వెరిఫికేషన్’, ‘లైవ్ వీడియో కేవైసీ’ని తప్పనిసరి చేయాలన్నారు. దీనివల్ల మ్యూల్ ఖాతాల‌కు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు.

సైబర్ నేరం జరిగిన వెంటనే బాధితుల సొమ్మును కాపాడాలన్నా, నేరగాళ్లను పట్టుకోవాలన్నా బ్యాంకుల నుంచి సత్వర స్పందన ఉండాలని ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఒక్కో బ్యాంకు ఒక్కో ఫార్మాట్‌లో స్టేట్‌మెంట్లు ఇస్తుండటం వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందన్నారు. అన్ని బ్యాంకులు ఒకే తరహాలో స్టేట్‌మెంట్లు ఇవ్వాలన్నారు. డెబిట్, క్రెడిట్ వివరాలతో పాటు, డబ్బు పంపిన/అందుకున్న వారి పూర్తి వివరాలు స్పష్టంగా ఉండాలి. పోలీసుల దర్యాప్తునకు కీలకమైన సాంకేతిక ఆధారాల‌ను వెంట‌నే పంచుకునేలా బ్యాంకులకు ఆదేశాలివ్వాలని కోరారు.

డైరెక్ట్ సెల్లింగ్, మల్టీలెవల్ మార్కెటింగ్ పేర్లతో జరుగుతున్న పిరమిడ్, పాంజీ స్కీమ్‌లు దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా మారాయని సీపీ పేర్కొన్నారు. ‘ఇంటి నుంచే సంపాదన’, ‘పార్ట్‌టైమ్ జాబ్స్’ పేరుతో నిరుద్యోగులు, గృహిణులను మోసగిస్తున్న ఇలాంటి సంస్థలపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సీపీ సజ్జనర్ లేవనెత్తిన అంశాలు, సమర్పించిన మూడు వేర్వేరు లేఖ‌ల‌పై ఆర్బీఐ గవర్నర్ శ్రీ సంజయ్ మల్హోత్రా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కీలక సమావేశంలో హైదరాబాద్ అదనపు సీపీ (క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, ఐపీఎస్, సీసీఎస్ డీసీపీ శ్వేత, సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

*పీఆర్వో,*

*హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్*

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande