
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల
జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision SIR) ప్రక్రియను వేగంవతం చేసింది. ఇందులో భాగంగా మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఎంట్రీలు, గైర్హాజరు ఓటర్లు, దేశంలోకి అక్రమంగా చొరబడిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే SIRలో భాగంగా తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారు. తాజాగా, ఈసీ ఆ రెండు రాష్ట్రాల ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
సీఎం స్టాలిన్ నియోజవర్గంలో లక్ష ఓట్లు తొలగింపు..
తమిళనాడులో 97.37 లక్షల ఓట్ల తొలగించినట్లుగా భారత ఎన్నికల సంఘం తెలిపింది. SIR ముందు అక్కడ మొత్తం 6.41 కోట్ల ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితాలో 5.43 కోట్లకు తగ్గింది. సుమారు 97.37 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అందులో మరణించిన వారు 26.94 లక్షలు, శాశ్వతంగా వలస వారు, గైర్హాజరైన వారు 66.44 లక్షలు ఉన్నారు. ఇక డూప్లికేట్ ఓట్లు 3.98 లక్షలుగా ఉంది. ఒక్క చెన్నైలోనే 14.25 లక్షల ఓట్లు తొలగించినట్లుగా అధికారులు వెల్లడించారు.
సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గం కోలత్తూర్లోనూ లక్షకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని నివేదికలు పేర్కొన్నాయి. రాష్ట్ర సీఈవో ఆర్చనా పట్నాయక్ మాట్లాడుతూ.. ఇది ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే ప్రక్రియ మాత్రమేనని, నిజమైన ఓటర్లు తిరిగి చేర్చుకోవచ్చని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు