
అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘అమరజీవి జలధార’ పథకంలో భాగంగా రూ. 7,910 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘అమరజీవి జలధార’ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. ఈ రోజు(శనివారం) ఉదయం నిడదవోలు నియోజకవర్గం పెరవలి వద్ద జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో సుమారు రూ. 7,910 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని, దీని ద్వారా దాదాపు 1.21 కోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి డెల్టా ప్రాంతంలోని ఐదు జిల్లాలు (తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ) ప్రయోజనం పొందనున్నాయి. కేవలం గోదావరి జిల్లాల కోసమే రూ. 3,050 కోట్లను కేటాయించారు. ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి వద్ద గోదావరి జలాలను సేకరించి, అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా ప్రతి ఇంటికీ సరఫరా చేయనున్నారు. జల్ జీవన్ మిషన్ నిధులతో చేపడుతున్న ఈ బృహత్తర ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV