
అమరావతి, 22 డిసెంబర్ (హి.స.): సైబర్ నేరగాళ్లు ఉద్యోగం పేరిట ఎరవేసి ఓ మహిళ నుంచి రూ.8.5 లక్షలు లాగేసి నిండా ముంచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం పంచాయతీ పేరాయిచెరువుకు చెందిన ఓ గృహిణి కొన్నాళ్లుగా ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. 20 రోజుల క్రితం ఉద్యోగం కల్పిస్తామంటూ అపరిచిత వ్యక్తుల నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓ లింక్ వచ్చింది. వారి మాయ మాటలు నమ్మి ఆమె వారిని టెలిగ్రామ్ ద్వారా సంప్రదించారు. ఇంటి వద్దనే ఉంటూ ఆన్‌లైన్‌లో రూ.లక్షలు సంపాదించ వచ్చునని నమ్మించారు. పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన ఆమె బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీల ద్వారా డబ్బులు పంపించారు. నమ్మకం కల్పించేందుకు రూ.లక్షల్లో లాభాలు వచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపించేవారు. ఆ మొత్తం ఆమె బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలంటే మరింత డబ్బు పంపించాలని కోరడంతో విడతల వారీగా రూ.8.5 లక్షలు చెల్లించారు. చివరకు రూ.11,500 ఆమె పంపించి సంప్రదింపులు నిలిపివేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ ఆదివారం తెలిపారు. టెలిగ్రామ్, వాట్సాప్, తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే వర్క్ ఫ్రమ్ హోం, అధిక లాభాలు వంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని ఎస్సై సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ