అనంతపురం శివారులో పేలిన తూటా
అనంతపురం, 22 డిసెంబర్ (హి.స.) అనంతపురం శివారులో పోలీసు తూటా పేలింది. దీంతో ఒక్కసారిగా పట్టణంలో కలకలం రేగింది. అయితే నిందితుడిని పట్టుకునే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం రాజా, దేవరకొండ అజయ్ పరిచయస్తులు
అనంతపురం శివారులో పేలిన తూటా


అనంతపురం, 22 డిసెంబర్ (హి.స.)

అనంతపురం శివారులో పోలీసు తూటా పేలింది. దీంతో ఒక్కసారిగా పట్టణంలో కలకలం రేగింది. అయితే నిందితుడిని పట్టుకునే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం రాజా, దేవరకొండ అజయ్ పరిచయస్తులు. ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ నగర్ (Vidyuth Nagar) లో వారు కలుసుకొన్నారు. అక్కడ అజయ్ మద్యం సేవించిన క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఇద్దరు బాహాబాహీకి దిగారు. కోపంతో రగిలిపోయిన దేవరకొండ అజయ్ పదునైన వస్తువును చేతిలోకి తీసుకున్నాడు. దానితో రాజాపై విచక్షణ రహితంగా దాడి చేశాడు.

దీంతో రాజా అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా దేవరకొండ అజయ్ కోసం సీఐ శ్రీకాంత్ గాలింపు చేపట్టారు. అనంతపురం శివారులోని ఆకుతోటపల్లి వద్ద నిందితుడు ఉన్నట్లు సీఐకు సమాచారం అందింది. అజయ్ కోసం సీఐ ఆకుతోటపల్లికి బయలుదేరి వెళ్లారు. లొంగిపోవాలని అజయ్ కు సూచించారు. అయితే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.

సీఐ నిందితుడిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు. వారి మధ్య కొంత పెనుగులాట జరిగింది. అజయ్ పదునైన వస్తువును చేతిలోకి తీసుకొని సీఐ శ్రీకాంత్ పై దాడి చేశాడు. దీంతో సీఐ చేతికి గాయమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో సీఐ తన వద్దనున్న తుపాకీ పని చెప్పాడు. నిందితుడైన అజయ్ మోకాలిపై కాల్చాడు. తుపాకీ తూటా (Gun Shooting) పేలడంతో పరిసరాల్లో ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. అనంతరం అజయ్ ను సీఐ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande