
అమరావతి, 22 డిసెంబర్ (హి.స.)
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను గ్రామంలో నూతనంగా రోడ్డును నిర్మించారు. బీటీ రోడ్డు ప్రారంభోత్సవాన్ని (BT Road Inaugration) సోమవారం నిర్వహించారు. రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. రోడ్డును ప్రారంభించిన రాకపోకలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వారం రెండో విడత భూ సమీకరణలో భాగంగా తాను వడ్డమాను గ్రామానికి వచ్చిన విషయం గుర్తు చేశారు. ఆ సమయంలో గ్రామస్తులు రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వీలైనంత త్వరగా రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చామన్నారు. చెప్పినట్లుగానే కేవలం వారం వ్యవధిలో రోడ్డు నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. గతంలో తుళ్లూరు నుంచి వడ్డమాను వరకు రోడ్డు దారుణంగా ఉండేదన్నారు. గ్రామస్తుల వినతి మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతేకాకుండా కేవలం వారం వ్యవధిలో రోడ్డు పనులు పూర్తి చేయించానని చెప్పారు.
-
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV