
అనంతపురం, 22 డిసెంబర్ (హి.స.)
అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో (SK University) ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు నిరసనకు దిగడంతో క్యాంపస్ ఒక్కసారిగా వేడెక్కింది. యూనివర్సిటీ హాస్టళ్లో కట్టెపు మాధుర్య (K Madhurya) అనే విద్యార్థిని అనారోగ్యంతో మతి చెందింది. యూనివర్సిటీలో ఎంఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాధుర్య ఆదివారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి వాడుతున్న మాత్రల వల్లనే ఆమెకు ఫిట్స్ వచ్చి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.
ఈ క్రమంలో అనారోగ్యంతో మాధుర్య మృతి చెందడం పట్ల యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం (Students Agitation) వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ అధికారులు సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వల్లనే మాధుర్య చనిపోయిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీలో ర్యాలీని నిర్వహించారు. అనంతరం క్యాంపస్ లో ధర్నాకు దిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV