
అమరావతి, 23 డిసెంబర్ (హి.స.):ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పనులకు తక్కువ ధరకే సిమెంట్‌ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్టీ కౌన్సిల్ సిమెంటుపై పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో ఆ మేరకు ధరలను సవరించింది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆన్‌లైన్ సిమెంట్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్(ఏపీ నిర్మాణ్) ద్వారా సిమెంట్ సేకరణకు మార్గదర్శకాలు జారీ చేసింది. 28 శాతం జీఎస్టీతో రూ.260 గా ఉన్న పీపీసీ రకం సిమెంట్ బస్తా ధర రూ.240కు తగ్గింది. ఓపీసీ రకం సిమెంట్ రూ.270 నుంచి రూ.249కు, పీఎస్‌సీ రకం సమెంట్ రూ.250 నుంచి రూ.231కు తగ్గింది. ఉత్తర తీరప్రాంత జిల్లాల్లో బస్తాకు రూ.10 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పీపీసీ రకం సిమెంట్ బస్తా రూ.250, ఓపీసీ రకం రూ.259, పీఎ్‌ససీ రకానికిరూ.241 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విభాగాలకు తక్కువ ధరకు సరఫరా చేసే సిమెంట్‌ను ఎరువు రంగు సంచులలో సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ