
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన అని ఆరోపించారు. నాడు ఎన్నికలకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారని, నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యామ్ల మీద జెలటిన్ స్టిక్స్లో బాంబులు వేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన కేటీఆర్.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు ఇది మానవ నిర్మిత విధ్వంసం అని మొత్తుకుంటున్నా, ఈ 'చిట్టి నాయుడి' ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన పేర్కొన్నారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజా ధనంతో కట్టిన చెక్ డ్యామ్లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా? ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్ స్టర్ల అడ్డాయా? అని నిలదీశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు