
అనంతపురం, 23 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే తన బిడ్డలను కాలువలోకి తోసేశాడు. ఒక బాలిక మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు మరో బాలిక కోసం గాలిస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్పకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు సింధు, అనసూయ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదు, ఆరు తరగతులు చదువుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కల్లప్ప తన కుమార్తెలు సింధు, అనసూయలను హెచ్ఎల్‌సీ కాలువ దగ్గరకు తీసుకెళ్లాడు. పెద్ద కుమార్తెను కాలువలోకి తోసేశాడు. ఇది చూసి భయంతో చిన్న కుమార్తె పరిగెత్తింది. అయినా వెంటాడి పట్టుకున్న కల్లప్ప.. ఆమెను కూడా కాలువలోకి తోసేశాడు.
పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో కుమార్తెలను కర్ణాటకలోని సిరిగేరి క్రాస్ వద్ద హెచ్‌ఎల్‌సీ కాలువలోకి తోసేశానని ఓసారి.. గ్రామ సమీపంలోని హెచ్ఎల్‌సీ కాలువలోకి తోసేశానని మరోసారి కల్లప్ప చెప్పి స్పృహ కోల్పోయాడు.
గాలింపు చర్యల్లో అనసూయ మృతదేహం లభ్యమైంది. సింధు కోసం గాలింపు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV