
అమరావతి, 23 డిసెంబర్ (హి.స.)
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ(మంగళవారం) ఉదయం ‘క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్’లో భాగంగా విద్యార్థులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. క్వాంటం ప్రోగ్రామ్ లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉంది. క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారు. ఆయుర్వేద, తక్షశిల, నలంద యూనివర్సిటీలు, సిల్క్ రూట్ లాంటి అంశాలను సాధించామని తెలిపారు. గణితంలో జీరోను, అడ్వాన్స్డ్ ఆస్ట్రానమీ లాంటి రంగాల్లో ఎప్పుడో నైపుణ్యాన్ని భారతీయులు సాధించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
భారత్‌కు ఆర్ధికంగా బంగారు పిచ్చుక అనే పేరు ఉండేది. 2 వేల ఏళ్ల క్రితమే ప్రపంచ జీడీపీలో 40 శాతం భారత్ నుంచే వచ్చేది. ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం కంటే టెక్నాలజీ అందిపుచ్చుకుని సేవల రంగంలో విప్లవం సాధించాం. వైద్యులు, ఇంజనీరింగ్, ఐటీ నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి భారతీయుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, జీఎస్టీ లాంటి సంస్కరణలతో అభివృద్ధి పథంలో ఉంటున్నామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV