
ఢిల్లీ24,డిసెంబర్ (హి.స.) : దేశవ్యాప్తంగా రబీ సీజన్ సాగు జోరందుకుంది. వాతావరణం అను కూలించడం, జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు ఉత్సాహంగా సాగు పనులు చేపట్టారు. గత ఏడాదితో పోలిస్తే ఈసా రి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి అందిన సమాచా రం ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 5.80 కోట్ల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి ఇది 5.72 కోట్ల హెక్టార్లుగా ఉండగా, ఈసారి అదనంగా 8.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేయడం విశేషం. ఈ మేరకు మంగళవారం కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
పప్పుధాన్యాలపై పెరిగిన మక్కువ
ఈ సీజన్‌లో రైతులు పప్పుధాన్యాల సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పప్పుధాన్యాల మొత్తం సాగు విస్తీర్ణం 126.74 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది ఇది 123.01 లక్షల హెక్టార్లు మాత్రమే. అంటే సుమారు 3.72 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. ఇందులో సెనగలదే సింహభాగంగా ఉంది. గత ఏడాది 86.81 లక్షల హెక్టార్లలో సెనగలు సాగు చేయగా, ఈసారి అది 91.70 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే ఒక్క సెనగ సాగులోనే దాదాపు 4.89 లక్షల హెక్టార్ల భారీ పెరుగుదల కనిపించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ