
ఢిల్లీ24,డిసెంబర్ (హి.స.)
భారత ఎన్నికల కమిషన్ (ECI) మంగళవారం (డిసెంబర్ 23) ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) కింద సిద్ధం చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేరళ నుంచి 24 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు ప్రధాన ఎన్నికల అధికారి రథన్ వెల్లడించారు. డ్రాఫ్ట్ జాబితాను ఈసీఐ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు, రాజకీయ పార్టీలకు కూడా ప్రతులను అందించారు.
డ్రాఫ్ట్ జాబితా ప్రకారం, కేరళలో మొత్తం 2,54,42,352 మంది ఓటర్లు నమోదు అయ్యారు. SIR ప్రక్రియలో భాగంగా 24,08,503 మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. తొలగించిన వారిలో 6,49,885 మంది మృతి చెందిన ఓటర్లు, 6,45,548 మంది కనబడని (Untraceable) ఓటర్లు, 8,16,221 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు ఉన్నారు. వీరితోపాటు 1,36,029 డూప్లికేట్ ఎంట్రీలు, 1,60,830 ఇతర కారణాల కింద ఉన్న ఓటర్లు గుర్తించి తొలగించారు. సవరణకు ముందు కేరళలో 2,78,50,855 మంది ఓటర్లు ఉండగా.. ఈ తొలగింపులు మొత్తం ఓటర్లలో 8.65% గా ఉన్నాయని అధికారులు తెలిపారు. డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు జనవరి 22 వరకు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 21న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని కెల్కర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ