
సంగారెడ్డి, 24 డిసెంబర్ (హి.స.)
ఓ మహిళను కత్తితో పొడిచి మెడలో ఉన్న బంగారు పుస్తెలుతాడును ఎత్తుకెళ్లిన వ్యక్తికి సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ బుధవారం వెల్లడించారు.
మ్యాతరి జగన్ (37) రాపిడో డ్రైవర్ గా పనిచేస్తూ ప్రస్తుతం ఇస్నాపూర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. తన జల్సాలు ఇతర అప్పులు తీర్చుకునేందుకు వచ్చిన ఆదాయం సరిపోలేదని భావించి అతడు ఒంటరి మహిళల వద్ద నుంచి బంగారాన్ని దొంగలించుకోవాలని ముందే పథకం వేసుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 22న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మామిడిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను కత్తితో మెడపై, కడుపులో పొడిచి బంగారు గొలుసుని ఎత్తుకెళ్లాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు, సీసీఎస్ పోలీసుల సహకారంతో సాంకేతిక ఆధారాలతో నిందితున్ని 24 గంటల్లోపే పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నిందితుడి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు గొలుసుతో పాటు ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు