
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్ సీపీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్ లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా సీపీ పాల్గొన్నారు. తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.
డిసెంబరు 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా 'స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్' నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..