
న్యూఢిల్లీ 24 డిసెంబర్ (హి.స.)దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో సారి సత్తా చాటింది. పరిశ్రమల స్థాపనకు కీలకమైన భూములను సమకూర్చడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 157 పారిశ్రామిక పార్కుల్లో అందుబాటులో ఉన్న మొత్తం 32,033 హెక్టార్ల భూమిలో.. పరిశ్రమల ఏర్పాటు కోసం ఏకంగా 30,749 హెక్టార్ల భూమి సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వెల్లడించింది. అలాగే మహారాష్ట్రలో 19,658 హెక్టార్లు, తమిళనాడులో 16,291 హెక్టార్లు, గుజరాత్‌లో 12,605 హెక్టార్లు భూమి అందుబాటులో ఉంది. ఈ మేరకు ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదికలో ఆయా గణాంకాలను విడుదల చేసింది.
మరోవైపు ఏపీలో ఉన్న 638 పారిశ్రామిక పార్కుల పరిధిలో 1,10,595 హెక్టార్ల భూమి ఉండగా అందులో 10,747 హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 4,523 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వాటి మొత్తం విస్తీర్ణం 7.70 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం 1.35 లక్షల హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. మొత్తం 6.45 లక్షల ప్లాట్లు ఉండగా 1.25 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పరిశ్రమల స్థాపనలో జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం ‘ప్లగ్ అండ్ ప్లే’విధానాన్ని ప్రోత్సహిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ