
ఢిల్లీ, 24 డిసెంబర్ (హి.స.)
ఈ రోజు ఉదయం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం సరిగ్గా 08:55:30 గంటలకు LVM3-M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్ సంస్థ రూపొందించిన అత్యంత భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్-2 (BlueBird Block-2) ను ఇది విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మొత్తం మూడు దశల్లో 15 నిమిషాల్లో ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ విజయంతో ఇస్రో వాణిజ్య ప్రయోగంలో చరిత్ర సృష్టించింది.
భారత అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించిన అద్భుత విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. అమెరికాకు చెందిన 'బ్లూబర్డ్ బ్లాక్-2' ఉపగ్రహాన్ని ఎల్‌వీఎం3-ఎం6 (LVM3-M6) రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష ప్రస్థానం లో ఒక గర్వకారణమైన మైలురాయి అని ఆయన అభివర్ణించారు. భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం గా ఇది రికార్డు సృష్టించిందని, ఈ విజయం మన శాస్త్రవేత్తల కఠోర శ్రమకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
ఈ ప్రయోగం 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో కీలక అడుగు అని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌లో భారత శక్తిసామర్థ్యాలను ఇది మరింత బలోపేతం చేసిందని, భారీ పేలోడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని (Heavy-lift capability) మరోసారి నిరూపించిందని ఆయన తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెబుతూ, ఈ ప్రాజెక్టులో భాగమైన ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV