
అమరావతి, 3 డిసెంబర్ (హి.స.)
: దిత్వా తుఫాను ప్రభావం నెల్లూరు, బాపట్ల జిల్లాలను తీవ్రమైన వర్ష విపత్తులోకి నెట్టేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో రెండు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగళవారం రాత్రి మరోసారి భారీ వర్షాలు కరిశాయి. దీంతో నగరాలు, శివార్లు, గ్రామాలు అన్నీ నీటితో నిండిపోయి ప్రజలకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరులో రాత్రి కురిసిన భారీ వాన నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా మాగుంట లేఅవుట్‌లోని రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీటమునిగిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఐదు అడుగుల వరకు నీరు నిలిచిపోవడంతో ప్రయాణాలు అర్ధరాత్రి నుంచే నిలిచిపోయాయి. మరోవైపు అనేక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందుల్లో మునిగిపోయారు. నగరంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రతి వర్షానికి సమస్యలు పెరగడానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ